పవన్ గొడవ పడేది ఎవరితో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుజరాత్‌లో గొడవకు దిగనున్నాడు. గబ్బర్ సింగ్ చిత్రం షూటింగులో భాగంగా గుజరాత్ లోని కొన్ని టెర్రిఫిక్ లోకేషన్లలో పవన్ కళ్యాణ్ విలన్లతో గొడవ పడే ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సినిమా ఇంట్రడక్షన్ ఫైట్ అని, ఈ ఫైట్ ద్వారానే పవర్ స్టార్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను సినిమాకే హైలెట్ అయ్యేలా చిత్రీకరించనున్నారు. మార్చి 23 నుంచి ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. మెగా కుటుంబానికి చెందిన హీరో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలోని కొన్ని సీన్లను కూడా ఇదే లొకేషన్లలో చిత్రీకరించడం గమనార్హం.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. ఏప్రిల్ 7న ఆడియోను, మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించనున్నాడు.
