Jr NTR Dammu Powerful Dialouges
‘‘నాలాంటోడ్ని ఎప్పుడూ కెలకొద్దు. పొరపాటున కెలికావో... చరిత్రలో కనీవిని ఎరుగని రేంజ్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోద్ది’’ అంటున్నారు ఎన్టీఆర్. అయితే ఇది నిజ జీవితంలో కాదు. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందుతున్న ‘దమ్ము’చిత్రంలో డైలాగ్ ఇది. ప్రస్తుతం అభిమానుల మధ్య హల్‌చల్ చేస్తున్న ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. మాస్‌ని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసే రేంజ్‌లో బోయపాటి ‘దమ్ము’ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఈ నెల 23న ఉగాది రోజు కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత కేఏ వల్లభ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘‘రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే విధంగా వస్తోంది. ఇందులోని ఉద్రేకాలు, ఉద్వేగాలు మళ్లీ మళ్లీ అభిమానుల్ని థియేటర్‌కి తీసుకొస్తాయి.
బోయపాటి దర్శకత్వ ఘాటుతో పాటు కీరవాణి సుస్వరాలు, ఆర్థర్ ఎ.విల్సన్ ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే ఎన్టీఆర్ స్టెప్స్ వండర్ అనిపించేలా ఉంటాయి. ఎన్టీఆర్‌ని ఫోకస్ చేస్తూ అభిమానుల కోసం కీరవాణి ఓ ప్రత్యేక శ్లోకాన్ని స్వరపరిచారు. అది అద్భుతంగా ఉంటుంది. అభిమానులకు వందశాతం ఆనందాన్ని పంచే ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నాం’’ అని ఆయన తెలిపారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, రంగనాథ్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: కేఎస్ రామారావు.
