నిర్మాతపై శ్రీయ కంప్లైంట్.. వివాదం
"ఆ సినిమాకి సైన్ చేసినప్పుడే వేరే భాషల్లో డబ్ చేయకూడదని ఒప్పంద పత్రం మీద నిర్మాతతో సంతకం పెట్టించాను. కానీ ఇప్పుడీ చిత్రం తమిళ డబ్బింగ్‌కి ఆయన సన్నాహాలు చేయడం బాధ కలిగించింది. అందుకే దక్షిణభారత నటీనటుల సంఘం దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ చేసాను. ఇక వేరే ఏ భాషలోనూ ఈ చిత్రాన్ని అనువదించకుండా ‘స్టే’ తేవడానికిగాను కోర్టుని ఆశ్రయించాలనుకుంటున్నాను" అని శ్రీయ మీడియాకు తెలిపినట్లు ఓ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఆమె మళయాళ చిత్రం ‘పోకిరి రాజా’ చిత్రం తమిళ డబ్బింగ్‌కి ఆయన సన్నాహాలు చేయడం బాధ కలిగించింది.
రెండేళ్ల క్రితం మలయాళంలో ఆమె ‘పోకిరి రాజా’ అనే చిత్రంలో నటించారు. మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించింది. ‘పోకిరి రాజా’ అంగీకరించినప్పుడు ఈ చిత్రాన్ని వేరే భాషల్లో అనువదించి విడుదల చేయకూడదని ఆ చిత్రనిర్మాత థామస్ ఆంటోనితో శ్రీయ ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇటీవల ఈ నిర్మాత ఆ ఒప్పందాన్ని గాల్లోకి వదిలేసి, ఈ చిత్ర అనువాద హక్కులను ఓ తమిళ నిర్మాతకు ఇచ్చారట. ఆ నిర్మాత ‘రాజా పోకిరిరాజా’ పేరిట ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం శ్రీయను షాక్‌కి గురి చేసింది. దాంతో మలయాళ నిర్మాతపై తగిన చర్య తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
