మర్డర్ కేసుగా మారుతున్న అల్పాన్సా సూసైడ్
తన ప్రియుడు వినోద్‌కుమార్ మృతి కేసులో నటి, ఐటం గర్ల్ అల్ఫాన్సా పూర్తిగా ఇరుక్కుపోతున్న పరిస్దితి కనపడుతోంది. ఆమె అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఐటం గర్ల్ అల్ఫాన్సా ఇంట్లో ఆమె ప్రియుడు, నటుడు వినోద్‌కుమార్ గత సోమ వారం మృతిచెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో అల్ఫాన్సా కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. తమ కొడుకును అల్ఫాన్సా కుటుంబ సభ్యులు హత్య చేశారని వినోద్ కుమార్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు మృతి మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అల్ఫాన్సా విచారణలో సేకరించిన సమాచారం, తమకు లభించిన ఆధారాల మేరకు వినోద్‌కుమార్ మృతిలో ఆమె ప్రమేయం లేదన్న భావన పోలీసుల్లో నెలకొంది. అయితే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం జరుగుతోందంటూ వినోద్ కుమార్ తండ్రి పాండియన్ పోలీసు కమిషనరేట్‌ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో పోస్టుమార్టం నివేదికతో పాటు కొత్త కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా తమకు లభించిన సమాచారం మేరకు అల్ఫాన్సాను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించాలని విరుగంబాక్కం పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమెను అరెస్ట్ చేయడానికి సైతం రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న అల్ఫాన్సా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చెన్నై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో వినోద్‌కుమార్ మృతి తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ పాపం ఎరుగని తనను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్న దృష్ట్యా ముందస్తు బెయిల్ మం జూరు చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కలైయరసన్ విచారించారు. ప్రభుత్వ న్యాయవాది, అల్ఫాన్సా న్యాయవాది వాదనలు విన్పించారు. అలాగే ఈ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని అల్ఫాన్సా న్యాయవాది విన్నవించుకున్నారు. దీంతో శుక్రవారం విచారణ అనంతరం బెయిల్ ఇవ్వాలా?వద్దా? అన్న నిర్ణయాన్ని న్యాయమూర్తి ప్రకటించనున్నారు.
