పిల్లి లాంటి ప్రభాస్ పులిలా మారి...
ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లలో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ...అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా కథానాయకుడు నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు మాట్లాడుతూ ''ఈ నెల 16 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం రూ.2 కోట్ల వ్యయమైంది. ప్రత్యేకంగా కాళీమాత విగ్రహాన్ని తయారుచేయించాం. మూడు పాటల్లో రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. స్వరాల బాధ్యతను కూడా లారెన్స్ తీసుకొన్నారు. జూన్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం''అన్నారు. అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్’స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.
