Mahesh Babu Praises Love Failure
ప్రేమ ఫెయిల్యూర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’. సిద్దార్థ, అమలపాల్ జంటగా నటించిన ఈచిత్రం తొలుత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి యువత నుంచి మంచి ఆదరణే లభిస్తోంది. తాజాగా ఈచిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా ఆకర్షించింది. సాధారణంగా ఇతరుల సినిమాల గురించి పట్టించుకోని మహేష్ బాబు ఈ సినిమా చాలా బాగుందంటూ పొగడ్తలు గుప్పించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ....‘నేను ఇటీవల చూసిన వినూత్న సినిమాల్లో లవ్ ఫెయిల్యూర్ ఒకటి. సిద్ధార్థ మరియు మొత్తం సినిమా టీంకు కంగ్రాట్స్’ అంటూ పేర్కొన్నారు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో, అందులోనూ చాలా రిజర్వుగా ఉండే హీరో నుంచి ఇలాంటి పొగడ్తలు రావడంతో ఆ సినిమా యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కామెంట్స్ వల్ల తమకు సినిమా చూసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకీ సరసన అంజలిని ఎంపిక చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.
