హై బడ్జెట్ అని పవన్ సినిమా ఆపేసారు
పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్న చిత్రానికి అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతోందని ఆపేసినట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు ప్రిన్స్ ఆఫ్ పీస్. 2010 లో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో ఆ మధ్య ప్రారంభమైన ఈ చిత్రం కొంత షూటింగ్ జరగి అర్ధాంతరంగా ఆగిపోయింది. మొదట పవన్ కళ్యాణ్,సింగీతం కలిసి జోర్డాన్ వెళ్లి మరీ లొకేషన్స్ చూసి ఫైనలైజ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోందని ఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారని అప్పట్లో వినిపించింది. ఈ మేరకు షూటింగ్ కూడా జరిగింది. గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మించటానికి ముందుకు వచ్చారు. అలాగే జెకె. భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుందని చెప్పారు.
దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించారని చెప్పారు. అయితే గత సంవత్సరకాలంగా ఈ సినిమాకు సంభంధించి ఒక్క న్యూస్ కూడా తర్వాత రాలేదు. సింగీతం,కృష్ణం రాజు కలిసి ఆపేయాలనే నిర్ణయానికి వచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే చిత్రం చేయటానికి కమిటయ్యారు.
