'సూపర్‌స్టార్'ఎవరో తేల్చి చెప్పిన రజనీకాంత్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాను సూపర్ స్టార్ ని కాదని ఆ స్టేచర్ కి సరిపోయే వ్యక్తి అమితాబ్ మాత్రమే అని తేల్చే చెప్పి తన నిరాడంబరతను మరోసారి ప్రదర్శించారు. ఆయన్ని రీసెంట్ గా కలిసిన మీడియా వారు..'సూపర్‌స్టార్'గా అందరూ అభిమానించడాన్ని ఎలా ఫీలవుతారని అడిగితే నవ్వి..."నాకు సంబంధించినంత వరకూ అమితాబ్ బచ్చన్ ఒక్కరే సూపర్‌స్టార్. నాకు ప్రతి సినిమా తొలి సినిమా వంటిదే. దర్శకుణ్ణీ, నిర్మాతనీ ఎంచుకుని విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా'' అని ఆయన చెప్పారు. అలాగే కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురై సింగపూర్‌లో వైద్య చికిత్స తీసుకున్న ఆయన "ఇప్పుడు నేను 90 శాతం బాగానే ఉన్నా. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు'' అని చెప్పారు.
ప్రస్తుతం రజనీకాంత్ 'కోచ్చడయ్యాన్' చిత్రంలో నటిస్తున్నారు.'రోబో' తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్. శరత్‌కుమార్, జాకీష్రాఫ్, శోభన, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్రీడీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 'అవతార్' తరహా టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. రజనీకాంత్‌తోపాటు శోభన, నాజర్‌లు 'యానిమేషన్ కాస్ట్యూమ్స్'లో నటిస్తున్న ఫొటోలు చిత్రవర్గాలు ఇటీవల విడుదల చేశాయి.
సినిమా గురించి రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ''కోచ్చడయాన్' సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో నటించడం అంత సులభం కాదు. సవాల్‌తో కూడుకున్న విషయం. ఊహకే అంతుచిక్కని లొకేషన్లు ఇందులో కనిపించడం విశేషం. ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదలవుతుంది''అని తెలిపారు. ఇందులో దర్శకురాలు సౌందర్య, ఏఆర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.'కోచ్చడయాన్' తెలుగు హక్కుల్ని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ దక్కించుకొంది.
