ఆరంభంలో ఐరెన్ లెగ్ అంటూ తిట్టిపోశారు : తమన్నా
వెండితెరకు పరిచయమైన కొత్తల్లో తనది ఐరెన్ లెగ్ అంటూ ప్రతి ఒక్కరూ ఆడిపోసుకున్నారని పాలబ్యూటీ తమన్నా అంటోంది. నాడు అలా అన్న వారే.. ఇపుడు గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించి విడుదలైన తాజా చిత్రం 'రచ్చ'. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రచ్చరచ్చ చేస్తోంది. ఈ చిత్రంలో తమన్నా తన అందాలను విచ్చలవిడిగా ఆరబోసి ప్రేక్షకులకు కనువిందు చేశారన్న టాక్ బాగా వస్తోంది.
దీనిపై తమన్నా మాట్లాడుతూ... తాను కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు చాలామంది చాలా విధాలుగా నెగెటివ్ పబ్లిసిటీ చేశారు. నేను నటించిన సినిమాలు ఆడట్లేదనీ, నాది ఐరన్ లెగ్ అనీ అనేవాళ్లు. నిజానికి నా ఉనికిని నలుగురికీ తెలియజేసిన విషయాలవి. అందుకే నేను రూమర్స్‌ను కూడా ఆసమయంలో ఎంజాయ్ చేసినట్టు చెప్పారు.
ఓవైపు గాసిప్‌లతో నడుస్తూనే కెరీర్‌పై దృష్టిపెట్టాను. మొత్తానికి ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్నవాళ్లే ఈ రోజున ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు. రాంచరణ్ 'రచ్చ'లో తనలోని అందాల్ని గొప్పగా ఆవిష్కరించిన ఆమె రానున్న రోజుల్లో రాం సరసన 'ఎందుకంటే ప్రేమంట', ప్రభాస్ సరసన 'రెబల్', పవన్ కల్యాణ్ జోడీగా 'కెమెరామన్ గంగతో రాంబాబు'లో కనిపించబోతోంది. మొత్తంమ్మీద తమన్నాది ఐరెన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అని తేలింది.
