Most Sexiest Women is Kareena
బాలీవుడ్ శృంగార నాయికలు ఎవరని అడిగితే అంతా టకటకా కత్రినా, కరీనా, దీపిక పదుకునె, ప్రియాంకాచోప్రా అంటూ భారీ లిస్ట్ చదివేస్తారు. అయితే గడచిన రెండు సంవత్సరాలుగా ఆసియా ఖండంలోనే అత్యంత శృంగార తారగా తన హవా కొనసాగిస్తున్న కత్రినాకైఫ్ కు ఈ సంవత్సరం బ్రేక్ పడింది. ఇప్పుడు ఆమె స్థానాన్ని కరీనాకపూర్ కైవసం చేసుకుంది. ‘ఈస్ట్రన్ ఐ’ అనే బ్రిటీష్ మేగజైన్ కండెక్ట్ చేసిన ఓ సర్వేలో ‘సెక్సీయెస్ట్ ఏషియన్ వుమెన్-2011’గా కరీనాకపూర్ ఎంపికయింది. అయితే కత్రినాకైఫ్ కంటే కొద్దిపాటి తేడాలో మాత్రమే కరీనా ఈ స్థానం కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఈస్ట్రన్ ఐ మ్యాగజైన్ ఎడిటర్ ఆస్జాద్ నజీర్ ధృవీకరించారు.
ఈ పోటీలో ఆసియాకు చెందిన అనేకమంది మోడల్స్, టివి యాంకర్స్, బాలీవుడ్ నటీమణులు ఎందరో పాల్గొన్నారని చివరకు విజయం కరీనాను వరించిందన్నారు. గత ఏడాది ఈ స్థానాన్ని దక్కించుకున్న కత్రినాకైఫ్ ఈ ఏడాది రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక మూడో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు.
నాల్గవ స్థానాన్ని బిపాసాబసు, ఐదవ స్థానాన్ని ఫ్రీదా పింటో దక్కించుకున్నారు. అరుదైన ఈ గౌరవం దక్కడంతో కరీనాకపూర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘‘సెక్సీ అనిపించుకోవడం ఒకప్పుడు పెద్ద తప్పుగా భావించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చూపులకు సెక్సీగా కనిపించడం అంటే అది మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే అంశం. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన ‘ఈస్టర్న్ ఐ’ పత్రిక వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు కరీనా.
కాగా ఇటీవల ఈ పోటీకి ముందు కొందరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కరీనా జవాబిస్తూ తనకంటే నెంబర్ వన్ స్థానం కత్రినాకే బెస్ట్ అని ఎందుకంటే తనకు ఈ నెంబర్ వన్ లమీద ఆసక్తి లేదని ప్రకటించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కరీనాకు ఈ స్థానం దక్కడం సబబేనని అభిమానులు మురిసిపోతున్నారిప్పుడు.
