దర్శకత్వ శాఖలో రాజమౌళి పట్టిందల్లా బంగారమేనా?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ పరంపరను కొనసాగిస్తున్న దర్శకుడు ఎవరయ్యా అని సినీ అభిమానులను అడిగితే ఠక్కున చెప్పే సమాధానం ఎస్ఎస్.రాజమౌళి అని అంటారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో టెలీ సీరియల్స్‌కు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ వచ్చారు.
గురువు రాఘవేంద్ర రావు సూచన మేరకు.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా "స్టూడెంట్ నంబర్-1" చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం 2001లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క చిత్రంలోనూ అపజయాన్ని చవిచూడక పోవడం ఆయనలోని దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే రాజమౌళి చేపట్టే ప్రతి కొత్త ప్రాజెక్టుపైనా భారీ అంచనాలు టాలీవుడ్‌లో నెలకొంటున్నాయి.
యేడాది ఒక్కో చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించే ఈయన... తన మొదటి చిత్రం (2001) తర్వాత రెండో చిత్రం కోసం రెండేళ్ళ విరామం తీసుకున్నారు. 2003లో జూనియర్ ఎన్టీఆర్-భూమిక-అంకిత జంటగా "సింహాద్రి"ని రూపొందించారు. ఈ చిత్రం అటు రాజమౌళికే కాకుండా, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా మంచి బ్రేక్‌ను ఇచ్చింది.
ఆ తర్వాత నితిన్ హీరోగా 2004లో "సై" చిత్రం వచ్చింది. 2005లో ప్రభాస్ హీరోగా "ఛత్రపతి", 2006లో రవితేజ హీరోగా "విక్రమార్కుడు", 2007లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా "యమదొంగ", 2009లో రామ్ చరణ్ హీరోగా "మగధీర", 2010లో కమెడియన్ సునీల్ హీరోగా "మర్యాద రామన్న" చిత్రాలను నిర్మించి ఎనిమిది వరుస హిట్లను తన ఖాతాలో రాజమౌళి వేసుకున్నాడు.
యాక్షన్, సెంటిమెంట్, ప్రేమ వంటి చిత్రాలను మాత్రమే కాకుండా "యమదొంగ"," మగధీర" వంటి పౌరాణిక చిత్రాలను సైతం అద్భుతంగా తెరకెక్కించగలనని తనకుతానుగా నిరూపించుకున్న సక్సెస్ దర్శకుడు రాజమౌళి. కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో పుట్టిన రాజమౌళి.. సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. నాలుగో తరగతి వరకు ఇక్కడే విద్యాభ్యాసం చేసిన ఆయన.. ఏలూరులో ఇంటర్ పూర్తి చేశారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోవడంతో రాజమౌళి మనస్సు కూడా అటువైపు లాగింది. దీంతో ప్రఖ్యాత ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
